భారతదేశంలోని చిన్న గ్రామాలలో రోడ్ వేయటం నుంచి, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వరకు అన్నీ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయి.
ప్రజల నుంచి అనేక రూపాలుగా పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు ఆ డబ్బును ఇందుకు వినియోగిస్తున్నాయి.
అయితే ప్రజా అవసరాలకు ప్రభుత్వాలు చేసే ఈ నిర్మాణాల్లో నాణ్యత లేకపోవటం పెద్ద సమస్యగా మారింది.
ఇందుకు కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రధాన కారణం. ప్రజల డబ్బును జీతాలుగా తీసుకునే ప్రభుత్వ అధికారులు, మంత్రుల వత్తిడికి, లంచాల ప్రలోభాలకు లొంగిపోయి అర్హత లేని సంస్థలకు పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు అప్పగించి నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు. రాజకీయ పలుకుబడి అడ్డం పెట్టుకుని తమకు, తమవారికి పెద్ద కాంట్రాక్టు పనులు దక్కించు కోవటానికే ఎక్కువమంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇక టెండర్ ప్రక్రియ నుంచి అన్ని స్థాయిల్లో వాటాలు పంచటం అందరికి తెలిసిన
చేదు నిజం. తర్వాత పనిని విభజించి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటం, తక్కువ కూలికి పనిచేసేవారిని, బాలకార్మికులను బీహార్, ఒరిస్సా, అస్సాం నుంచి తీసుకువచ్చి శ్రమ దోపిడీకి పాల్పడటం సాధారణ ప్రక్రియగా మారింది. ఎక్కువ లాభాలకోసం నాణ్యతను పట్టించుకోకుండా పై పై మెరుగులతో పేక మేడల్లా నిర్మాణాలు చేయటం, అతి తక్కువ కాలానికే అవి కూలినా, కొట్టుకుపోయినా ఎంక్వయిరి కమిషన్ల పేరుతో కాలయాపన చేయటం ప్రస్తుత కాంట్రాక్ట్ వ్యవస్థ నిజ స్వరూపం.
అంటే అందరికీ జీవనోపాధి చూపాల్సిన ప్రభుత్వాలే కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా
అసంఘటిత రంగాన్ని ప్రోత్సహించటం సిగ్గుచేటైన వ్యవహారం.
'జన శక్తి'
ప్రజలనుంచి అనేకరూపాలలో పన్నులు వసూలుచేస్తున్న ప్రభుత్వాలు, ఆ డబ్బును ప్రజా అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నామని చెబుతూ, అసంఘటిత రంగ కాంట్రాక్ట్ వ్యవస్థలకు ఎందుకు ధారా దత్తం చేయాలి.
సమాచార, సాంకేతిక, పారదర్శకత విస్తృతంగా పెరిగిన ప్రస్తుత సమాజంలో ఒక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా 'జన శక్తి' పేరుతో నిరుద్యోగ యువతనంతా ఏకం చేయవచ్చు. అస్సలు చదువులేని కూలీ నుంచి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారందరికీ, ఈ పోర్టల్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారి ప్రాంతము, అర్హతలు, అనుభవము, నేర్పరితనం, పని కుశలత వంటి వివరాలను నమోదు చేయించాలి. వారి ఆధార్, విద్యా, అనుభవ, పని కుశలతలకు సంబంధించిన పత్రాలతో పాటు, బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా నమోదు చేసుకోవాలి. వాటి ఆధారంగా దినసరి జీత భత్యాలను ప్రభుత్వం నిర్దేశించి, అన్ని రకాల బీమా సౌకర్యం కల్పించాలి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో నేరుగా భర్తీ ప్రక్రియ నిలిపివేసి, 'జన శక్తి' లో ఎక్కువ పనిదినాల ఆధారంగా నియామకాలు చేపట్టాలి.
ఇప్పుడు ఈ 'జన శక్తి' పోర్టల్ పని తీరు నిర్దేశించుకుందాం. ఇందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. 'పనికి పిలిచేవారు' అంటే దేశవ్యాప్తంగా కోటి రూపాయలు పైన ఏ ప్రభుత్వ పని అయినా సంభందిత శాఖల అధికారులు ఈ 'జన శక్తి' పోర్టల్ ద్వారానే పనివారిని పిలవాలి.
రెండవది 'పని కోరేవారు' అంటే దేశం మొత్తంగా వయసు, అర్హతలతో నిమిత్తం లేని నిరుద్యోగులు. ప్రభుత్వాలు చేపట్టే ఏ నిర్మాణ పనులకైనా టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టరుకు అప్పగిస్తారు. అంటే ఆ పనియొక్క పూర్తి వివరాలను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కలిగి ఉంటారు. అదే సమాచారాన్ని నిర్దేశిత విధానంలో 'జన శక్తి' పోర్టల్ లో ఎంటర్ చేస్తే, దానిలో పొందుపరిచిన సాఫ్ట్ వేర్ ద్వారా విశ్లేషించుకుని, వివిధ స్థాయిల్లో ఆయా ప్రాంతాలలో అవసరమైన పని వారి జాబితా రూపొందిస్తుంది. అంతేకాదు ఆటోమేటిక్ గా వారందరికీ మెసేజ్, మెయిల్స్ పంపిస్తుంది. వారంలోపు వారి సమ్మతితో రిప్లై రాకుంటే లిస్ట్ లో సెకండ్ ప్రయారిటీ వారిని గుర్తించి, సమాచారం వెళుతుంది.
ఇదే తరహాలో ఆయా పనులకు అవసరమయ్యే రా మెటీరియల్ అంటే స్టీల్, సిమెంట్, రాయి, ఇసుక వంటివన్నీ సప్లై కోరుతూ మరొక వెబ్ సైట్ మరియు యాప్ రూపొందించాలి. అందులోనే క్రేన్స్, జె సి బి లు, ట్రక్కులు, ఇతర భారీ నుంచి చిన్నతరహా వరకూ అన్ని రకాల పనిముట్లు సప్లై కోరేవిధంగా ఉండాలి. ఇందులోకూడా సప్లై కోరేవారు, సప్లై చేసేవారు అనే రెండు విభాగాలు ఉంటాయి.
ఈ కొత్త విధానంలో అసంఘటిత రంగ కార్మికులకు సరైన వేతనం, బీమా సౌకర్యాలతో నిర్దిష్టమైన పని అవకాశాలు దొరుకుతాయి. పలు ప్రాజెక్టులలో కస్టపడి ఎక్కువ రోజులు పనిచేయటం ద్వారా నేరుగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం దొరుకుతుంది. అటు ప్రభుత్వాలకు, పారదర్శక పని విధానంతో జవాబుదారీతనం పెరిగి, కమీషన్లు, లంచాలు, పెర్సన్టేజ్ వంటి అక్రమాలకు కాలంచెల్లుతుంది. అడుగడుకు నిఘా ద్వారా పటిష్ట నిర్మాణాలకు అవకాశం కలుగుతుంది.
కాంట్రాక్ట్ వ్యవస్థ అక్రమాలకు అడ్డుకట్ట వేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించటం వంటి అనేక
ప్రయోజనాలు ఈ 'జన శక్తి' ద్వారా కలుగుతాయి.
No comments:
Post a Comment