"పున్నమి (పూర్ణిమ)(పౌర్ణమి) వెన్నెల
పండుగ"
ఏమిటి: మనం జరుపుకునే అన్నిపండుగల ముఖ్య ఉద్దేశ్యం గమనిస్తే, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, సామాజిక హితం కోరుతూ, నిరంతరాయంగా జనం ఆచరించేందుకు మన పూర్వికులు ఏర్పరిచి ఉంటారని అర్ధం చేసుకోవచ్చు.
అదే ఆలోచనతో రూపుదిద్దుకున్నది "పున్నమి
(పూర్ణిమ)(పౌర్ణమి) వెన్నెల పండుగ" ప్రతిపాదన.
ప్రతినెలలో వచ్చే పూర్ణిమ రోజు రాత్రి చంద్రుని వెన్నెల కాంతిలో, విద్యుత్ నిలిపివేసి జనమంతా ఆహ్లాదంగా పండుగ జరుపుకోవటమే దీని ప్రత్యేకత.
ఎందుకు: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువశాతం విద్యుత్ ఉత్పత్తి శిలాజ ఇంధనమైన బొగ్గు ద్వారానే జరుగుతోంది. టెక్నాలజీ పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో విద్యుత్ అవసరం గణనీయంగా పెరుగుతోంది.
మరోవైపు శిలాజ ఇంధనాలు తరిగి అడుగంటిపోతున్నాయి.
ఈనేపథ్యంలో విద్యుత్ వినియోగంలో పొదుపు అందరి బాధ్యతగా
గుర్తించాలి. ఇందుకు నిర్బంధ విధానాలకన్నా, సామజిక భాగస్వామ్యంతో ప్రతినెలా ఒకరోజు
పూర్ణిమ రాత్రి వెన్నెలలో పండుగ జరుపుకోవటం అత్యుత్తమ మార్గము.
ఎలా: ప్రతినెలా పున్నమి రోజు రాత్రి ఏడు గంటలనుంచి పదకొండు గంటల మధ్య విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, అపార్ట్ మెంట్ అసోసియేషన్లు, రెసిడెన్షియల్ కాలనీ సొసైటిలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంస్థలు, రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు, ఇన్నర్ వీల్ క్లబ్లు ఇలా జన భాగస్వామ్యం కలిగిఉన్నఅన్ని సంస్థలు, సంఘాలు ఈ పండుగలో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలి.
పున్నమి వెన్నెల పండుగను అపార్ట్ మెంట్ టెర్రస్ ల పైన, ఆరు బయట స్థానిక ఖాళీ ప్రదేశాలలో, ఆట స్థలాలు, ఉద్యాన వనాలలో, ఏవిధమైన విద్యుత్ దీపాలు వినియోగించకుండా, ఆరుబయట పూర్తివెన్నెల కాంతిలో ఈ పండుగను నిర్వహించాలనేది ఇందులో
అతిముఖ్యమైన నిబంధన.
అర్బన్ ప్రాంతాలలో పౌర్ణమి రాత్రి వీధి
దీపాల నిలుపుదల ద్వారా భారీగా విద్యుత్ పొదుపు చేయవచ్చు.
ఎవరు: ఇందులో కుల,మత, ప్రాంత, వర్ణ, వర్గ విభేదాలకు అవకాశం ఇవ్వకుండా, లింగ బేధాలు, వయసు తారతమ్యాలు లేకుండా, విశ్వవ్యాప్తంగా, సర్వ మానవాళి సంతోషంతో భాగస్వాములు కావచ్చు.
ఐక్య రాజ్య సమితి, యునెస్కో, వంటి పెద్ద సంస్థల సహకారంతో
ప్రపంచమంతా జరుపుకునేలా ప్రచారం చేయవచ్చు.
దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ముఖ్య మంత్రులు, మంత్రులు, గవర్నెర్లు, కలెక్టర్లు, మేయర్ల సహకారం కోరి, వారంతా పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు కృషి చెయ్యాలి.
ఆత్యాధ్మిక వేత్తలు, మత పెద్దలు, శాంతి కాముకులు, పర్యావరణ
హితులతో, సామాన్యులలో 'పున్నమి వెన్నెల పండుగ'పై అవగాహన
కల్పించవచ్చు. సినిమా, క్రీడారంగ సెలబ్రెటీలతో అవగాహనా
ప్రచారం జరపాలి.
ఎక్కడ: వెన్నెలలో నదులు, లేక్ లలో పడవలపై విహారాలు, ఇసుక తిన్నెల్లో విందులు, సాగరతీర
బీచ్లలో ప్రత్యేక ఏర్పాట్లు, సంగీత విభావరులు నిర్వహించవచ్చు.
హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులతో అవగాహన ద్వారా పున్నమి
వెన్నెల్లో విందులు.
ఏంలాభం: ప్రపంచమంతా ఈ పండుగ నిర్వహణ ద్వారా విద్యుత్ పొదుపు తద్వారా పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశ్యము. దీనితోపాటు నేటి తరానికి అవసరమయ్యే ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశలున్నాయి.యాంత్రిక జీవనంలో భాగమైపోతున్న ప్రస్తుత తరానికి, సాముహిక సమావేశాలతో మానవ సంబంధాలు, వాటి విలువ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
డి జె సౌండ్స్ మోతతో శబ్ద కాలుష్యాన్ని సృష్టించటం మానేసి, సమూహాల్లోని వ్యక్తులు, వారి పిల్లలలో అంతర్గతంగా దాగిన సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించవచ్చు. సాముహిక వెన్నెల రాత్రి భోజనాలతో మనుషుల మధ్య అంతరాలను తగ్గిస్తూ, సామాజిక సమానత్వ భావాన్ని చాటి చెప్పవచ్చు.
మొత్తంగా నెలలో ఒక్కసారి అయినా, చుట్టు పక్కల వారిని కలిసి
మంచి చెడులు నేరుగా మాట్లాడుకునే వేదికలుగా ఉపయోగించుకోవచ్చు.
నెలకొకసారి వ్యక్తులు, కుటుంబాల మధ్య ముఖాముఖీ కలయిక, పరస్పర సమావేశములు, వారి ప్రతిభా పాటవాలను చాటుకునేలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సత్స్ంగములు, సహపంక్తి భోజనాలు వంటివెన్నో ఈ వెన్నెల రాత్రిలో ఆనందంగా నిర్వహించుకోవచ్చు. అనేక
రంగాలలో తీవ్ర పని వత్తిడికి గురవుతున్న నేటి తరం వెన్నెల కాంతిలో మానసిక ప్రశాంతత
పొందవచ్చు.చంద్ర కాంతితో అనేక మానసిక రుగ్మతలు దూరమవుతాయి.వెన్నెల కిరణాలతో
దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయమవుతాయి. దీని
ద్వారా టివీ లు, కంపూటర్లు, మొబైల్ ఫోన్ల మధ్య చిక్కుకుపోతున్న భవిష్యత్
యువ తరానికి, పున్నమి వెన్నెల కాంతితో ఆహ్లాదాన్ని, ప్రకృతి పరిమళాన్ని
అనుభూతి చెందేలా ప్రోత్సహించవచ్చు. మొత్తంగా భావితరాలకు విద్యుత్ పొదుపు,
వెన్నెల హాయి పట్ల మక్కువ కలిగేలా చేయటం.
ఈ విధానాలను ఆచరణాత్మకంగా అమలు చేయటం ద్వారా పర్యావరణ పరిరక్షణలో యావత్ ప్రపంచానికి భారత దేశం నేతృత్వం వహించి, మార్గనిర్దేశం చేస్తూ ఆదర్శంగానిలవటం తధ్యం.