బ్లాక్ మనీ పై గోల రోజూ వింటూనే ఉన్నాం. ప్రతిపక్షం చర్యలు తీసుకోవాలంటుంది. ప్రభుత్వం ఎవ్వరిని వదలమంటుంది. రాందేవ్ బాబా లాంటి వాళ్ళు పెద్ద నోట్లను రద్దు చేయాలంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఒక్కటే. కొన్ని దేశాల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడల్లా, ఆదేశపు వాడుక కరెన్సీని మార్చి వేస్తారు. జనాభా ఎక్కువ కలిగిన మనదేశంలో ఇది అమలు చేయటం, కష్టమే. అయితే, పెద్ద నోట్లను అంటే వెయ్యిరూపాయలు, ఐదువందల రూపాయలు మార్చితే, సగం సమస్య తీరిపోతుంది.
అంటే ప్రభుత్వ పరంగా, చెలామణీలో ఉన్న పెద్ద నోట్లను మార్చేందుకు నిర్ణయం చేయాలి. చెలామణిలో ఉన్న ఆయా నోట్ల సంఖ్యను బట్టి, రిజర్వ్ బ్యాంకు ద్వార కొత్త నోట్లను ముద్రించాలి. నిర్ణీత తేది నుంచి రెండు లేదా మూడు నెలల లోపు తమ వద్ద ఉన్న పెద్దనోట్లను, అన్ని జాతీయ బ్యాంకుల ద్వారా కొత్త నోట్లుగా మార్చుకునే ఏర్పాట్లు చెయ్యాలి. దీనివల్ల దేశంలోకి పెద్దమొత్తంలో వస్తున్న దొంగనోట్లను కూడా అరికట్టవచ్చు. మార్చుకునే డబ్బుకు కొంత పరిమితి ఉండాలి. అది దాటితే శ్లాబు పద్దతిన, నామ మాత్రపు పన్నుతో మార్చుకునే వెసులుబాటు కల్పించాలి.
ఈ పెద్దనోట్లు కేవలం ధనవంతులవద్ద అధికమొత్తంలో దాచుకునే అవకాశం ఉంది. మధ్యతరగతి వారు అవసరం మేరకు మాత్రమే ఈ నోట్లను కలిగి ఉంటారు. పేదల చేతికి ఈ నోట్లు వచ్చినా, వెంటనే మార్చుకుని అవసరాలు తీర్చుకుంటారు.
ఇందుకు కావాల్సింది ప్రభుత్వ పెద్దలలో చిత్తశుద్ధి. అదివుంటే, కఠిన నిర్ణయాలను కూడా సరళ రీతిలో అమలు చేయవచ్చు.
ధనవంతుల ఖజానాల్లో మగ్గిపోతూ, వెలుగు చూడని నోట్ల కట్టలను బయటకు తీసుకురావటమే, ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం. అందువల్ల, పెద్దమొత్తంలో సంపద దాచుకున్న వారిని నేరస్తులుగా చూడటం మాని, అతి తక్కువ పన్ను చెల్లింపు ద్వారా, వారి మొత్తం డబ్బుని కొత్త కరెన్సీలోకి మార్చుకునే అవకాశం కల్పించాలి. ఆ డబ్బుని దేశ మౌలికరంగ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలి. ఆ డబ్బుతో వారే స్వయంగా కొత్తగా పరిశ్రమలు పెట్టేవిధంగా ప్రోత్సహించాలి.