మానవజాతి మనుగడకే కొరివి పెడుతున్న కాలుష్య రక్కసిని, శాశ్వతంగా నియంత్రించే అద్భుత ప్రయోగం.
సేఫ్, చీప్, ఫాస్ట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం
కాలుష్య రహిత భారతదేశం
భారత దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన బ్రిటీషువాళ్ళు మనకు చేసిన గొప్ప మేలు, రైల్వేలైన్ల నిర్మాణం. ఈ దేశ సంపదని గుత్తగా ఓడ రేవులకు తరలించేందుకు ఈ నిర్మాణాలను విస్తృతంగా చేశారు . దానితోపాటు తమ సైన్యాన్ని పెద్ద ఎత్తున ఒక చోట నుండి మరొక చోటికి పంపేందుకు ఈ రైల్వేలైన్లను ఉపయోగించుకున్నారు.
ఐతే తర్వాతి కాలంలో ఆ రైల్వే వ్యవస్థే మన దేశానికి అతిపెద్ద రవాణామార్గంగా మారింది. బొగ్గు ఇంజన్ల స్థానంలో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్లు వచ్చాయి. మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ గా, ఎలక్ట్రిక్ లైన్లుగామారాయి. కాని ఇప్పటికీ అవే లైన్లను (రూట్లను ) వినియోగించుకుంటున్నాము. వీటితో లెక్కిస్తే, స్వాతంత్ర్యం తర్వాత కేవలం పది శాతం కన్నా తక్కువ మాత్రమే కొత్త లైన్లు (రూట్లు ) వేయటం ఆశ్చర్యకర నిజం.
ఇందుకు దేశవ్యాప్త సర్వే కోసం, సంబంధిత రంగాల నిపుణులతో పాటు, ఆయాప్రాంతాల్లోని యూనివర్సిటీ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవచ్చు. శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించుకుని, హెలికాప్టర్ల వాడకంతో ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధృడంగా, రైల్వే ట్రాకులు నిర్మించాలి. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనువుగా, పటిష్టంగా వీటి నిర్మాణం ఉండాలి.ఎందుకంటే, ప్రపంచంలో గంటకు 784 కిలోమీటర్ల వేగంతో, విజయవంతంగా బుల్లెట్ రైలు నడిచిన విషయాన్నిమరువకూడదు. ప్రస్తుతం గంటకు 350 నుంచి 450 కిలోమీటర్ల స్పీడు నడిపినా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే పటిష్టమైన ట్రాకుల నిర్మాణం అవసరం.
ట్రాక్ కు ట్రాక్ కు మధ్యన అవసరమైన దూరం పాటిస్తూ పది ట్రాకుల నిర్మాణం అంటే, ఒక కిలోమీటరు వెడల్పుతో వీటిని ఏర్పాటు చేయాలి. ట్రాక్ మొత్తం తిన్నగా (స్ట్రైట్ )గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాగార్జున సాగర్ వంటి పెద్ద ప్రాజెక్ట్ లు, తాజమహల్ వంటి ప్రాచీన కట్టడాలు అడ్డొస్తే తప్ప, ఈ ట్రాక్ ను మలుపులు తిప్పకూడదు. ట్రాక్ మొత్తానికి కంప్యూటర్ అనుసంధానిత సిగ్నల్ వ్యవస్థను, ముందుగానే రూపొందించుకోవాలి.
ఈ రైల్వే ట్రాక్ పొడవునా రెండువైపులా, ఎలక్ట్రిక్ లైన్లు , ఆప్టిక్ ఫైబెర్ కేబుల్, వాటర్ పైప్ లైన్స్, ఆయిల్ పైప్ లైన్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్, సోలార్ పవర్ ప్లేట్స్, సోలార్ ఫెన్సింగ్ వంటివి నిర్మాణ దశలోనే అమర్చుకోవాలి. ఈ ట్రాక్స్ పై టన్నులకొద్దీ బరువైన గూడ్స్, పాసింజెర్ రైళ్ళ రాకపోకలవల్ల విద్యుత్ శక్తి తయారు చేయగల సామర్ధ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధమైన సాంకేతిక పరీక్షలు వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. రైల్వే లైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిపై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్ నిర్మాణ దశలోనే క్రింది భాగంలో వత్తిడి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాలను అమర్చి, వాటి తీగలను ( వైర్స్ ) గ్రిడ్ కు అనుసంధానం చేయవచ్చు.
ఇదంతా ఖర్చుతో కూడిన ప్రక్రియ అయినప్పటికీ, దేశ విద్యుత్ అవసరాలను గుర్తించి ముందడుగు వేయాలి. కాలుష్య రహితంగా, పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ఇటువంటి సాంకేతికతను అభివృద్దిపరచి ఉపయోగించుకోవాలి.
ఈ స్థాయిలో దేశం మొత్తం హై స్పీడ్ రైల్వేస్ నిర్మాణం చేపడితే ఆయా లైన్ల వెంట రెండువైపులా వంద కిలోమీటర్ల పరిధిలో భూముల విలువ ఎంత స్థాయిలో పెరుగుతుందో, ప్రభుత్వాలు ముందుగానే అంచనాకు రావాలి. అక్కడి రియల్ ఎస్టేట్ రంగం పెరుగుదలకు ఉన్న అవకాశాలను గుర్తించి, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలి. వాటి ద్వారా స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమకూరే ఆదాయ మార్గాలను పరిశీలించాలి. ఆయా ప్రాంతాలలో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. మొత్తంగా ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఆధునిక వసతులతో కొత్త పట్టణాలు, నగరాలూ, మహా నగరాల నిర్మాణానికి అవకాశాలు కల్పించాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్లు ( సెజ్ ),భారీ పరిశ్రమలు, కార్పోరేట్ అగ్రి పార్క్ లు, ట్రాన్స్ పోర్ట్ హబ్ లు, ఈ ట్రాక్ కు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలి. వాటి రవాణా అవసరాలకు ప్రత్యేక లైన్లు వేసి, మెయిన్ ట్రాక్ తో కలపాలి. నీటి లభ్యతను బట్టి ట్రాక్ కు రెండువైపులా నగరాలకు దగ్గరలో శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మించవచ్చు .
ఇంత వివరంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించటానికి చాలా కారణాలు ఉన్నాయి. మనదేశంలో 1994 నుంచి బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ ట్రైన్ ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు రద్దీ ఉండే కొన్ని నగరాల మధ్య హై స్పీడ్ రైళ్ళు నడపాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలకు, కేవలం ఉన్నత వర్గాల వారికి ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ ప్రతిపాదనలు ఉంటున్నాయి. దేశంలో అక్కడక్కడా ముక్కలు ముక్కలుగా కొత్త లైన్లు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కేవలం ఇరవై శాతం ఉన్న ధనిక వర్గాల ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని, ఆ దిశగా ఆదాయం వచ్చే మార్గాల మీదే పెట్టుబడులు పెడితే మిగిలిన ఎనభై శాతం సామాన్యుల రవాణా అవసరాలకు ఎప్పటికి తీరవు. ప్రజా రవాణాకు ఒకటి, రెండు హై స్పీడ్ రైలు మార్గాలతో సరిపెడితే, సరుకు రవాణా మొత్తం ఇప్పటిలాగే రోడ్లకే పరిమితమవుతుంది. దేశంలో ఎనభై శాతం సరుకు రవాణా, రోడ్డు మార్గాల ద్వారానే జరుగుతోంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి గ్రామాల నుంచి నగరాల వరకు సరుకు రవాణాను పెద్ద ఎత్తున ఈ హై స్పీడ్ రైలు మార్గాలకు మళ్ళించాలి. అందుకే ఎక్కువ సంఖ్యలో రైల్వే ట్రాకులు అవసరమవుతాయి.
దీనివల్ల దేశానికి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న గ్లోబల్ వార్మింగ్, క్లైమెట్ చేంజెస్ వంటి ప్రక్రుతి విపత్కర సమస్యలనుంచి మనదేశానికి ముప్పు తొలగిపోతుంది. జనాభా పరంగా రెండో పెద్ద దేశమైన భారత్, మిగతా దేశాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. అది ఏవిధంగా సాధ్యమవుతుందో మీరూ పరిశీలన చేయండి.
ఇంత పెద్ద దేశంలో సరుకు రవాణాకు, ప్రజా రవాణాకు, లారీలు, బస్సుల ద్వారా ప్రతి రోజు ఎంత పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే, డీజల్, పెట్రోల్ వాడుతున్నామో అందరికి తెలిసిన విషయమే . వీటి వినియోగంతో ఎంత స్థాయిలో కాలుష్యం సృష్టించ బడుతోందో ఉహించండి.
ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవటానికి ఏ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నామో గ్రహించండి. అంటే ఈ దేశ ప్రజల కష్టార్జితంగా వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరే సొమ్మును, విదేశాలకు ధారపోస్తూ, కాలుష్య కారకాలైన పెట్రోలియం ప్రొడక్ట్స్ కొని తెచ్చుకుంటున్నామనేది వాస్తవం. అసలు మనదేశంలో పూర్తి స్థాయిలో లభ్యత లేని పెట్రోలియం ప్రొడక్ట్స్ ను, సామాన్యులకు సైతం నిత్యావసరంగా అందుబాటులోకి తెచ్చిన గత పాలకుల ఆలోచనాలోపం ప్రస్తుత తరానికి శాపం. దీని నుంచి ఇప్పటికైనా బయటపడి, పూర్తి స్థాయి హై స్పీడ్ రైల్వే వంటి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోకపొతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరగటం ఖాయం.
ఈ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ ద్వారా, సరుకు రవాణా, ప్రజా రవాణా జరిగితే,
రోడ్డు మార్గంలో వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని డెబ్బై శాతం పైగా తగ్గించవచ్చు. అంతేస్థాయిలో విదేశీమారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు.
అయితే దీనివల్ల ఇప్పటికే దేశంలో విస్తరించి ఉన్న లారీ, బస్సు వంటి రవాణా రంగాలు, వాటికి అనుబంధంగా ఉన్న ఆటోమొబైల్, టైర్ల పరిశ్రమలు, శాశ్వతంగా నష్టపోతాయనే ఆందోళన కలుగవచ్చు. నిజానికి ఈ రంగాలేవి దెబ్బతినే ప్రమాదం ఉండదు. కానీ క్రమంగా వాటి పరిధి తగ్గుతుంది. అంటే ఉదాహరణకు బెంగుళూరు నుంచి అస్సాంకు వేల కిలోమీటర్లు సరుకు రవాణా చేసే లారీలు, సిటీకి దగ్గరలోని రైల్వే ట్రాన్స్ పోర్ట్ హబ్ నుంచి సమీప వంద, రెండొందల కిలోమీటర్ల పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు సరుకును ఎక్కువసార్లు రవాణా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బస్సులు కూడా తక్కువ దూరానికి ఎక్కువసార్లు జనాన్ని చేరవేయాల్సి వస్తుంది. పెద్ద సంఖ్యలో నగరాలకే పరిమితమైన బస్ సర్వీసులు, పట్టణాలు, గ్రామాలకు విస్తరిస్తాయి. క్రమేపి వీటి అవసరాలు తగ్గటం వల్ల ఆయా రంగాలు కొత్త ఉత్పత్తులను నిలిపివేసి ఇతర రంగాలకు మళ్లుతారు. ఇదంతా సమయానుకూలంగా జరిగే ప్రక్రియ కనుక, వెంటనే వచ్చే ప్రమాదం ఎంతమాత్రమూ ఉండదు.
దేశ ఉజ్వల భవిష్యత్ కు ఉపకరించే ఇటువంటి భారీ నిర్మాణాలను ఎట్టి పరిస్థితులలోను, విదేశీ కంపెనీలకు, బడా కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదు. అవసరమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని(టెక్నాలజీ) , అందులో నైపుణ్యమున్న మానవ వనరులను విదేశాలనుంచి పెద్ద జీతాలు ఇచ్చి ఉద్యోగులుగా, మన దేశానికే రప్పించాలి. ఆనాడు బ్రిటిష్ వారు భారత దేశవ్యాప్తంగా రైల్వే లైన్లు నిర్మించినపుడు కూడా కేవలం పది శాతం మంది మాత్రమే వాళ్ళ ఇంజనీర్లు, అధికారులు పర్యవేక్షించారు. మిగిలిన తొంభై శాతం ఈదేశపు ప్రజల శ్రమే అన్న నిజం మరచిపోకూడదు. ఇప్పుడు కూడా మన దేశ యువతకు ఆధునిక హైస్పీడ్ రైల్ టెక్నాలజీ గురించిన అన్ని రంగాలలో పూర్తిస్థాయి శిక్షణ ఇప్పించి, నిపుణులుగా మలచుకోవాలి. మొదటి దశలో కొన్ని హైస్పీడ్ రైలు ఇంజెన్లు విదేశాలనుంచి కొనుగోలు చేసినా, తరువాతి కాలానికి మన దేశంలోనే తయారుచేసే స్థాయికి ఎదగాలి. హైస్పీడ్ రైలు సామర్ద్యానికి అవసరమయ్యే ఎయిర్ కండిషన్డ్ కంటైనర్ గూడ్స్ పెట్టెలు, లెస్ వెయిట్ గూడ్స్ పెట్టెలు, ఎయిర్ కండిషన్డ్ పాసింజెర్ బోగీలు, లగ్జరీ పాసింజెర్ బోగీలు వంటి అన్నిటిని, మన దేశంలోనే తయారుచేసుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. కాయకష్టం చేసుకునే వారినుంచి ఉన్నత విద్యావంతుల దాకా, ఎంతోమందికి ఇందులో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు మధ్య అంతరాలు తొలగి, వేగవంతమైన సరకు రవాణాకు అవకాశం కలుగుతుంది.
ఇంత పెద్ద హై స్పీడ్ రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే, లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ఇండియన్ రైల్వేస్ ప్రస్తుత సామర్ధ్యాన్ని హామీగా చూపి విదేశాలనుంచి కొంత పెట్టుబడులు సాధించవచ్చు. దీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా మరికొంత , ప్రాధాన్యతలను కల్పిస్తూ దీర్ఘకాలిక పాసుల విక్రయం ద్వారా ఇంకొంత పెట్టుబడులుగా పొందవచ్చు. పెద్ద పరిశ్రమలు, సంస్థల సరకు రవాణాకు ప్రవేట్ లైన్స్ నిర్మించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని, ముందస్తు పెట్టుబడులు స్వీకరించవచ్చు.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్ట్ ను కొన్ని జోన్లుగా, పని విభజన చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. జోన్ల పరిధిలోని రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి కొంత మొత్తం, వారి పూచికత్తుతో మరికొంత విదేశీ పెట్టుబడులు సాధించవచ్చు. దేశంలోని అన్ని నగరాలలోనూ శాశ్వతంగా మకాం వేసుకుని ఉండే, మిలటరీ వారి పర్యవేక్షణలో ఈ హైస్పీడ్ రైల్ ట్రాక్స్ నిర్మాణం జరగాలి. అన్ని మిలటరీ కంటోన్మెంట్లను కొత్తగా ఈ రైల్వే ట్రాక్ ల వెంబడి ఏర్పాటు చేయాలి. ఎప్పుడో నిర్మించిన పాత కంటోన్మెంట్ ప్రాంతాలన్నీనగరాల్లో కలిసిపోయినందున, ఆయా ప్రాంతాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చు. అంటే ఆ భూములు వేలం ద్వార అమ్మకంతో భారీ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్ పది సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయటం ద్వారా, పట్టుదల ఉంటే సాధించలేనిది ఉండదని ప్రపంచానికి చేసి చూపాలి.
మహానగరాలలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైల్ వ్యవస్థను, ఐదు నుంచి పది లక్షల జనాభా కలిగిన అన్ని నగరాలకు విస్తరించాలి. అయితే గత మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ నిర్మాణాల మాదిరిగా బడా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే విధానానికి ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆయా రాష్ట్రాల రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సంస్థలను అభివృధి పరచాలి. అంటే రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలను, రైల్ రోడ్ రవాణా సంస్థలుగా మార్చుకోవాలి. ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాల నుంచి వంద కిలోమీటర్ల పరిధిలోని ఇతర నగరాలూ, పట్టణాలు, గ్రామాలకు ప్రతి పది నిమిషాలకు ఒక్కో బస్సు చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మార్గాలలో మెట్రో రైల్, లేదా మోనో రైల్ ఏర్పాట్లు రాష్ట్ర రైల్ రోడ్ రవాణా సంస్థల ఆధ్వర్యంలో జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఆయా సంస్థల ప్రస్తుత స్థాయి, ఆస్తుల విలువ ఆధారంగా, విదేశీ రుణాలు, కేంద్ర సహాయం ద్వార స్వంతంగా నిర్మాణ, నిర్వహణకు అవకాశం కల్పించాలి.
నగరాలలో వ్యక్తిగత కార్లు, టూవీలర్లు విపరీతంగా పెరిగి కాలుష్యాన్ని, ట్రాఫిక్ సమస్యలను సృష్టిస్తున్నాయి. వీటికి వాడుతున్న ఇంధనాలు కూడా, విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాము. కాలంతో పోటీపడుతున్న నగర జీవన క్రమంలో, కాలుష్యం లేని సైకిల్స్ వాడమంటే ఎవరికీ అంత ఓపిక, తీరిక లేవు. స్వంత వాహనాలు ఒదిలేసి బస్సుల్లో తిరగాలంటే పొల్యుషన్, ట్రాఫిక్ జామ్, విపరీతమైన రద్దీ వంటి సమస్యలు అంతకంతకు పెరిగి భయపెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థను, వేగవంతమైన, భద్రతతో కూడిన, తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే జనం స్వంత వాహనాలను పక్కనపెట్టి సౌకర్యవంతమైన మెట్రో రైల్, మోనో రైల్ సేవల వైపు ఆకర్షితులవుతారు. అందుకు ప్రస్తుతం సిటీ, సబర్బన్, మెట్రో, నాన్ స్టాప్ బస్సులను నడుపుతున్న రాష్ట్రాల ఆర్ టి సి సంస్థలు తమ ఆదాయాన్ని నష్టపోకుండా, మెట్రో రైల్, మోనో రైల్ నిర్మాణ, నిర్వహణలను అప్పగించి బలోపేతం చేయాలి. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి వేళల్లో ఈ మెట్రో రైల్, మోనో రైల్ సర్వీసుల ద్వార మధ్య స్థాయి సరుకు రవాణాకు అవకాశం కల్పించాలి. అందుకు అవసరమైన బోగీలు, ఎగుమతి, దిగుమతులకు సదుపాయాలు సమకూర్చాలి.
ఈ విధమైన ఏర్పాటు ద్వారా ప్రస్తుతమున్న బస్, లారీ సర్వీసులు సరైన రవాణా సదుపాయాలు లేని మారుమూల పల్లెలకు పంపే అవకాశం కలుగుతుంది. దీని వలన ప్రధాన మార్గాలలో కాలుష్య రహిత ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గి, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు.
అదే కాల వ్యవధిలో మరో వైపు జల మార్గ సరుకు రవాణాను ప్రోత్సహించాలి. భారతదేశానికి మూడువైపులా ఉన్న సముద్ర మార్గాలలో, భారీగా సరుకు రవాణాకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ వంటి సముద్ర తీర రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో ఓడ రేవుల నిర్మాణాన్ని చేపట్టి అభివృద్ధి చేయాలి. వేగవంతమైన సరుకు రవాణా వ్యవస్థ కాక పోయినప్పటికీ, భారీ స్థాయిలో విదేశాలకు సరుకు ఎగుమతులకు, దిగుమతులకు ఈ ఓడ రేవులు ఎంతో ఉపయోగపడతాయి. మొత్తంగా చూస్తే ఎనభై శాతం వరకు సరుకు రవాణా రోడ్డు మార్గాన్ని వదిలి, హైస్పీడ్ రైల్ ట్రాక్స్, జల రవాణా వైపు మారుతుంది. దీనివల్ల భారీ స్థాయిలో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది. అంతే స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.
భారత శక్తిని ప్రధమ స్థాయిలో నిలిపేందుకు, చిత్తశుద్ది కలిగి, ధృడ సంకల్పంతో, జనహితం కోసం, సాహసోపేతమైన నిర్ణయాలను పటిష్టంగా నేర్పుతో అమలుచేయగల నాయకులే ఇందుకు సమర్ధులు.