"రైల్ పవర్"
భారతదేశం అన్నిరంగాలలో అభివృద్ధి సాధించాలంటే, ముందుగా విద్యుత్ ఉత్పాదనలో స్వయంసంవృద్ధి సాధించాలి.
అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి, కాలుష్యకారకమైన సంప్రదాయ పద్ధతులను వదిలేసి, పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని కొత్త విధానాలను రూపొందించాలికొత్త ఆవిష్కరణలకు అవసరమైన పరిశీలన, పరిశోధనలకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించాలి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కాలుష్య రహిత, నిరంతర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలిగిన ఒక కొత్త ఆలోచనను మీముందుకు తెస్తున్నాము. దీనిని "రైల్ పవర్" గా వ్యవహిరిద్దాము.
భారతీయ రైల్వే ద్వారా దేశం మొత్తం విస్తరించి ఉన్న రైల్వే ట్రాకుల నుంచి విద్యుత్ ఉత్పాదనకు పూర్తి అవకాశాలు ఉన్నాయి.
ఈ రైల్వే ట్రాకుల మీదుగా టన్నులకొద్దీ బరువుతో, వేగంగా గూడ్స్, ప్యాసింజెర్ రైళ్ళు ప్రతిరోజూ రాక పోకలు సాగిస్తూ ఉంటాయి.
బరువుతో కూడిన ఈ రైళ్ళ రాకపోకల ద్వారా రైలుపట్టాల క్రింది భాగంలో విపరీతమైన వత్తిడి ఏర్పడుతుంది. ఈ వొత్తిడిని శక్తి గా మలిస్తే విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుంది.
రైలు పట్టాల క్రింద ఆధారంగా ఉండే స్లీపర్ దిమ్మలు ఈ వొత్తిడిని నిరోధిస్తాయి. అంటే రైలు పట్టాలపై పడే భారాన్ని, క్రింది స్లీపర్ దిమ్మలు ప్రతిఘటిస్తాయి. ఈ రెండిటి మధ్యన జరిగే చర్య, ప్రతిచర్య ఫలితంగా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. ఇందుకు సంబందించి పూర్తి స్థాయిలో పరిశోధనలు, పరిశీలనలు చేయవలసిన అవసరం ఉన్నది.
"రైల్ పవర్" పరిశోధనకు కనీసం వంద కిలోమీటర్ల, ఎటువంటి అంతరాయంలేని రైల్వే ట్రాక్ అవసరమవుతుంది. ఈ ట్రాక్ పై తక్కువ బోగీలతో, లోడ్ చేయని గూడ్స్ రైలు తక్కువ వేగంతో నడిపి, ఏమేరకు విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందో పరిశీలించాలి. అలాగే ఎక్కువ బోగీలతో సరుకు లోడ్ చేసిన గూడ్స్ రైలును ఎక్కువ వేగంతో నడిపి, ప్రయోగ ఫలితాలు బేరీజు వేయాలి.
ఈవిధంగా రైల్వే ట్రాక్ పై ఎన్ని టన్నుల బరువుతో, ఎంత వేగంతో వెళితే, ఏస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుంది అనే సంపూర్ణ ప్రయోగ ఫలితాలను నమోదు చేయవలసి ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదనపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడా "రైల్ పవర్" వినియోగంలో లేదు. పూర్తి స్థాయి పరిశోధనలు జరగలేదు. బహుశా ఇందుకు కారణం ఆయా దేశాల్లో విద్యుత్ కొరత లేకపోవటం అయి ఉండవచ్చు. మరొక ప్రధాన కారణం "రైల్ పవర్" పరిశోధన, పరిశీలనకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన కష్ట సాధ్యమైన విషయం కావటం. పరిశోధన ఫలించినా, అమలు పరిచేందుకు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. రైల్వే లైన్ల వెంట ఎటువంటి రక్షణా వుండదు. ట్రాక్ మొత్తం స్లీపర్ల కింద విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసే పరికరాలకు భద్రత ఉండదు. అలాగే ఈ పరికరాలు ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం వంటి అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.
ముఖ్యంగా ప్రయాణీకుల రైళ్ళలో టాయిలెట్ల నుంచి వ్యర్ధాలు నేరుగా ట్రాక్ మధ్యన స్లీపర్ల మీదే పడుతుంటాయి. అయితే ఇవన్నీ అధిగమించలేని పెద్ద సమస్యలేమీ కావు.
అయితే భారతదేశంలో "రైల్ పవర్" పరిశోధనకు పెద్దమొత్తంలో ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా, అన్ని వనరులు, మౌలిక సదుపాయాలు సమకూర్చి ఉన్నాయి. కేవలం భారత ప్రభుత్వ చొరవ, ప్రోత్సహం ఉంటె చాలు.
భారతీయ రైల్వేలో భాగంగా ఉన్న
'DFCCIL' Dedicated Freight Corridor Corporation of India వారి ద్వారా గూడ్స్ రైళ్ళ కోసం నిర్మిస్తున్న ప్రత్యేక రైల్వే ట్రాక్స్ కొన్ని, భూమి లభ్యత లేని కారణంగా అసంపూర్ణంగా ఆగిపోయాయి.
వీటిలో వంద కిలోమీటర్ల పైన నిర్మాణం పూర్తి అయిన ట్రాక్స్ ఉన్నాయి. ఈ ట్రాక్స్ ను ఒక సంవత్సర కాలం వరకూ "రైల్ పవర్" పరిశోధనకు కేటాయిస్తే, తక్కువ ఖర్చుతో ప్రపంచంలోనే ఒక కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోయవచ్చు. విశ్వమంతా ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యకు, సరికొత్త పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో శాశ్వత పరిష్కారం చూపవచ్చు.
భారత ప్రభుత్వం ప్రతిపాదించిన 'అటల్ ఇన్నోవేషన్ మిషన్' కార్యక్రమాన్ని, ఈ "రైల్ పవర్" పరిశోధన ద్వారా ప్రారంభించాలని మా వినతి.
ఇదంతా ఖర్చుతో కూడిన ప్రక్రియ అయినప్పటికీ, దేశ విద్యుత్
అవసరాలను గుర్తించి ముందడుగు వేయాలి. కాలుష్య రహితంగా, పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ఇటువంటి సాంకేతికతను అభివృద్దిపరచి ఉపయోగించుకోవాలి.
No comments:
Post a Comment