Monday, 20 August 2018

అభివృద్ధికి ఆధ్యాత్మికత అడ్డమా?

అభివృద్ధికి ఆధ్యాత్మికత అడ్డమా?
నాస్తిక, హేతువాద, మానవ వాదులు అసంబద్ధమైన ఈ విషయాన్ని యువతరానికి నూరిపోస్తూ, గందరగోళానికి గురిచేస్తున్నారు.
ఇదంతా తిరోగమన విధానం అనే వీరు, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతమందికి ఉపాధి దొరుకుతోందో ఆలోచించారా? కేవలం బ్రాహ్మణులు మాత్రమే లబ్ది పొందుతున్నారనే అక్కసు ఎలా వెళ్లగక్కుతారు? కొబ్బరికాయలు, పళ్ళు, పూలు, పసుపు ఇలా ఎన్నో పూజా సామాగ్రి, పండించే వారి నుంచి, అమ్మే వారి వరకూ ఉపాధి దొరకటం వాస్తవం కదా?
మీవాదాలతో వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించగలరా?

విద్య, వైద్యం అవసరం గుర్తించే, రాబడి కలిగిన ప్రాచీన దేవాలయాలు, ఎప్పుడో ప్రత్యామ్నాయ ఆలయాలుగా, విద్యాలయాలు, వైద్యాలయాలు నెలకొల్పి సేవలను విస్తృతం చేయటం మీకు కనపడదా?

మసీదుల్లో కప్పే చద్దర్లు హిందువులు నేస్తారు. చర్చి లో వెలిగించే కొవ్వొత్తులు ముస్లింలు తయారు చేస్తారు. దేవాలయాల వద్ద పూలు, పండ్లు క్రిస్టియన్లు, ముస్లింలు
 అమ్ముతారు. ఇంతటి పరమత గౌరవంతో భిన్నత్వంలో ఏకత్వంగా బతికే భారతదేశంలో మీ వాదాల చిచ్చులు అవసరమా?

నిజమే, గతంలో ఆధ్యాత్మికత పేరుతో, దురహంకార, ఆధిపత్య ధోరణి, వివక్షలు, కొనసాగాయాయి. అయితే ఆదిశంకరులు, రామానుజాచార్యులు, వివేకానందుడు వంటి ఎందరో కాలానుగుణంగా కుల ఆధిపత్యాన్ని, మత మౌఢ్యాన్ని నిలువరించి, ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేయలేదా? వారు చైతన్య పరచిన, వసుధైక కుటుంబం, మానవ సేవే మాధవ సేవ, కర్తవ్యమ్ దైవమాహ్నికం, కృషితో నాస్తి దుర్భిక్షం, అంతకు మించి కొత్తగా మీ దగ్గర చెప్పటానికి ఏముంది?
కొన్ని ఇతర దేశాల పరిస్థితులు ప్రస్తావిస్తూ, ఈ ప్రార్ధనాలయాలవల్ల ఉత్పత్తి ఏముంది, వాటి స్థానంలో కర్మాగారాలు పెట్టి ఉత్పాదనతో పాటు, ఉపాధికి అవకాశం కల్పించాలి అంటారు. ఇలాంటి ముందు చూపు లేని ఆలోచనలు యువతను బాగా ఆకర్షిస్తాయి. కానీ ఆయా దేశాల్లో నైతికవిలువల పతనం, కుటుంబ సంబంధాల విచ్ఛిన్నం, పెరిగిపోయిన గన్ కల్చర్, ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కపు విపరీత ధోరణులు ఇవేమి వీరికి తప్పుగా తోచవు. అంటే వీరికి ఆధ్యాత్మికత ద్వారా అలవడే విచక్షణా జ్ఞానం, విలువలు, వివేకం, ప్రేమ, దయ, కరుణ వంటి సద్గుణాలేవి లేని రోబోలుగా బతకాలనేది ఉద్దేశమా? 


అభివృద్ధికి ఆధ్యాత్మికత అడ్డమా? - 2

ప్రార్ధనాలయాలవలన ఎటువంటి ఉత్పత్తి జరగదని, దేశాభివృద్ధికి ఇవి అవరోధాలని నాస్తిక, హేతువాద. మానవవవాదుల ఆరోపణ. కానీ దేవాలయాలు భక్తి మార్గంలో, జనమనసుల్లో మానసిక వికాసాన్ని,
 చైతన్యాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. నీతి, న్యాయం, దానం, ధర్మం, నైతిక విలువలు వంటి ఎన్నో పాజిటివ్ ఆలోచనలు కలిగిస్తూ జీవన విధానాన్నిసన్మార్గంలోకి తీసుకువెళతాయి. 

మనుషుల్లో సహజంగా పెరిగే స్వార్ధాన్ని, పాపం - పుణ్యం, స్వర్గం - నరకం, పేరుతొ నియంత్రిస్తాయి.       
మనదేశంలో దేవాలయాలు ఎక్కువవవుతున్నది నిజమే, కానీ మీరు అభివృద్ధి చెందాయనే దేశాల్లో అంతకన్నా ఎక్కువగా మారణాయుధాలు, మత్తుమందులు, మానసిక వైకల్యాలు, పెరుగుతున్నాయి. 
ఆధ్యాత్మికత కొరవడిన ఆయా దేశాల యువత ఎవరికి పుట్టారో తెలియక, మానసిక సంఘర్షణతో ఒత్తడి ఎదుర్కొంటున్నారు. మత్తుమందులకు బానిసలై, విచక్షణా రహితంగా స్కూల్ పిల్లలపై కాల్పులకు,  
విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వారి మానసిక వైకల్యాలకు మీ రోబోటిక్ ఆలోచనా విధానమే కారణమని, వైద్యులు చెబుతున్న నిజాలు జీర్ణించుకోలేకపోతున్నారా?

భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించిన, అనేక దేశాలవారు, వేద భూమి, కర్మ భూమి, పుణ్య భూమి, అని కీర్తిస్తూ, మన దేశాన్ని సందర్శిస్తున్నారు. కొన్నిదేవాలయాల్లో విదేశీయులని అనుమతించరని తెలిసినా, అక్కడి నేలను తాకితే చాలని, పరితపిస్తూ వస్తున్నారు. ప్రాచీన భారతీయ కళా, సాంసృతిక వైభవాన్ని కనులారా వీక్షించి, అధ్యయనం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
  
ఈ ఆధ్యాత్మిక పర్యాటకం ద్వారా భారదేశానికి లభిస్తున్న ఆదరణ ప్రతిఏటా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీని ద్వారా దేశానికి జరుగుతున్న ఆదాయ లబ్ది గురించి వేరే చెప్పాలా? ఈ కోణంలో అర్ధం చేసుకున్నా,  నాస్తిక, హేతువాద. మానవవవాదుల ఆరోపణలు, పూర్తి అవాస్తవాలని తేలిపోతోంది. వీరు చెప్పే ఉత్పత్తి ఎగుమతుల ద్వారా వచ్చే మారక ద్రవ్యం, అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటకుల రూపంలో లభిస్తోందని గ్రహించలేరా? ఇక దేశీయంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వారి వల్ల, ఏ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయో తెలుసుకోలేరా? ఇదంతా ఆధ్యాత్మికత ద్వారా జరుగుతున్న అభివృద్ధి కాదనగలరా? మీ వాదాలతో వీరందరి ఉపాధి ఎలా భర్తీ చేయగలరు?


 అభివృద్ధికి ఆధ్యాత్మికత అడ్డమా? - 3

 హిందువుల ఆధ్యాత్మిక మూలాలైన, వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మం, వంటి మహోన్నత విషయాలపై ఏ పరిశోధనలు చేసి, ఈ నాస్తిక, హేతువాద, మానవ వాదులు విమర్శలు చేస్తున్నారు? 
కనీసం వాటి అధ్యయనానికి అవసరమయ్యే సంస్కృత భాష కూడా పూర్తిగా తెలియని వీరు, విపరీతార్ధాలు కల్పించి హేళనగా వాదాలకు దిగటం సమంజసమేనా?

భారతదేశ స్వాతంత్ర్య సాధనలో అగ్ర భాగాన నిలిచిన గాంధీగారు నిరంతరం భగవద్గీత చేతపట్టుకుని తిరిగిన ఆస్తికులని తెలుసా? భారతదేశ విఖ్యాత శాస్త్రవేత్త, మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం గారు భగవద్గీతపై రాసిన పుస్తకాలు వీరెప్పుడైనా చదివారా? 
అంతటి మహానుభావులను అవమానించే రీతిలో మీ అడ్డగోలు వాదనలు ఉంటున్నాయని గ్రహించలేరా? 

భక్తి పేరుతో మోసపూరితమైన వ్యాపారం నడుస్తోందని, కొందరి ఆరోపణ. వాస్తవానికి అత్యాశకు పోయేవారిని, తేలిగ్గా మోసం చేయటం, అన్ని రంగాల్లో సాధారణంగా జరిగే విషయమే. విద్య, వైద్య రంగాల్లో దోపిడీ అందరూ చూస్తున్నదే. అందుకని విద్య, వైద్యం సమాజానికి అవసరం లేదంటారా?

చదువుకున్న వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు సైన్స్ పేరుతో బహుళజాతి కంపెనీలు భారతదేశ ప్రజల్ని భయపెడుతూ ఏ స్థాయిలో దోచుకుంటున్నారో గుర్తించండి. 
సైన్స్ అడ్డగోలు ప్రయోగాల వల్లే దేశంలో పంట భూములు విషమయమయ్యాయని తెలుసుకోండి.మానవజాతికి 

కనిపించే దైవమైన ప్రకృతిని సైన్స్ అపరిపక్వ పెరుగుదల ఎలా నాశనం చేస్తోందో గమనించండి. మీరు చెప్పిన వైజ్ఞానిక అభివృద్ధి మూలంగానే అడవులు నాశనమవుతున్నాయి, నదులు గతి తప్పుతున్నాయి.
ఇంకా ఎన్నో ఎన్నో అనర్థాలకు మీరు చెప్పిన వైజ్ఞానిక పురోభివృద్ధి కారణం అవుతున్నా, మేము ఎన్నడూ దానిని నిందించలేదు ఎందుకంటే అన్ని అనర్థాలకు కారణం మనం వాటిని అర్థం చేసుకొని అన్వయించుకొని వాడుకోవటం లోనే ఉంటుంది ప్రతిదానికి మంచి-చెడు రెండూ ఉంటాయి మంచిగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది చెడుగా వాడుకుంటే చెడ్డ ఫలితాలను ఇస్తుంది. అంతేకానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చేయదు. 

మీరు science అనే విజ్ఞానం, wisdom అనే జ్ఞానం నుంచే వచ్చిందనే విషయం గుర్తించండి. ఆంటే జ్ఞానం నుంచే విజ్ఞానం పుట్టింది.

రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు మరియు విమాన ప్రమాదాలలో అనేక మంది మరణానికి కారణం ఈ వైజ్ఞానిక అభివృద్ధి అని ఎవరైనా వాదన చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరు చేసే వాదన కూడా అలానే ఉంది. క్రికెట్ పై బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్స్ అనే పెద్ద వివాదాలే ఉన్నాయి. కానీ క్రికెట్ బ్యాన్ చేయమని అనగలరా? ఆధ్యాత్మిక రంగాన్నే ఎందుకు వేలెత్తి చూపుతారు? 

వీరికి మరో ముఖ్య అంశం, వివక్ష. అగ్రకులాల ఆధిపత్యంతో, నిమ్న వర్గాలు తరతరాలుగా వివక్షకు గురయ్యాయని తెగ బాధ పడిపోతూవుంటారు. మీరు చెప్పే  వివక్ష ప్రస్తుతం సమాజంలో మీకు కనపడదా? ఒక ఆఫీస్ లో అందరూ CEO లు, మేనేజర్ హోదాల్లోనే పనిచేస్తున్నారా? వివిధ హోదాల్లో ఒకరి కింద మరికొంతమంది పనిచేయటాన్ని వివక్షగా భావిస్తారా? పై అధికారి, కింది స్థాయి ఉద్యోగులపట్ల ప్రవర్తించే తీరును వివక్ష అనగలరా? వారి మధ్య జీతాల తేడాలు వివక్ష పూరితమైనవని ఉద్యమించగలరా?

ఒక డాక్టర్ కన్నా, నర్స్ ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు. కానీ ఆ ఇద్దరికి లభించే గౌరవానికి, ఆదాయానికి గల భారీ వ్యత్యాసాలను వివక్షగా గుర్తిస్తారా? అన్ని రంగాలలో ముఖ్య హోదాల్లో ఉండే పది మంది పెద్దలు, వందల, వేలమందిని శాసిస్తూ, నియంత్రిస్తూ పని చేయిస్తారు. 
వీటిని వివక్షలుగా చూడగలరా? అదేవిధంగా మీరు చెప్పిన వివక్షకు కారణం కూడా ధర్మశాస్త్రాలను అన్వయించుకొని ఆచరించడంలో జరిగిన తప్పిదమే కానీ శాస్త్రాలలో ఎక్కడ తప్పులేదు

అంతెందుకు మానవ వాదులమని చెప్పుకునే మీరు, ఎప్పుడైనా మీ కారు డ్రైవర్ తో, మీ ఇంటి డైనింగ్ టేబుల్ పై కలిసి భోజనం చేశారా? మీ ఇంటి పని మనిషిని, మీ కుటుంబ సభ్యులతో కలిపి ఏదైనా ఫంక్షన్ కు తీసుకువెళ్లారా ? గుండెలమీద చెయ్యి వేసుకుని, అలోచించి నిజాలు చెప్పండి.


అభివృద్ధికి ఆధ్యాత్మికత అడ్డమా? - 4

సమాజ సుస్థిర, సమగ్ర, పురోభివృద్ధికి నిరంతర మార్గదర్శిగా, ఆధ్యాత్మికతను ఎందరో మహనీయులు పరిపుష్టం చేశారు. ఆధ్యాత్మికతను సమాజానికి రక్షణ కవచంగా మలిచారు.

 ఈ వాస్తవాలను నాస్తిక, హేతువాద, మానవ వాదులు, సహేతుకమైన అధ్యయనంతో పరిశీలించుకోవచ్చు. ఏ మతానికి చెందిన ప్రార్ధనాలయాలైనా, ప్రకృతి విపత్తుల సమయాల్లో, సురక్షిత ప్రాంతాలుగా అందించే సేవలు మరువగలరా? సరైన గూడులేక సమాజంలో అట్టడుగున బ్రతికేవారికి, నిలువ నీడనిచ్చి, విలయం నుంచి కోలుకునేవరకూ, ఆహార, పానీయాలు అందించే ధార్మిక సేవకు, ఆధ్యాత్మిక చైతన్యం కారణమని మీకు తెలియదా? 

జీవకోటి మనుగడకు ఆధారమైన ప్రకృతికి దైవత్వాన్ని ఆపాదించి, సంరక్షించు కోవటం నేర్పిన భారతీయ సంస్కృతినా మీరు వ్యతిరేకించేది. భూమి, నీరు, చెట్టు,  ఇలా సమస్త ప్రకృతిని, నిత్య జీవనంలో భాగంగా పూజించే మహొన్నత ఆదర్శాన్ని తప్పుపట్టగలరా? జగతికి వెలుగునిచ్చే సూర్యుడిని, ప్రత్యక్ష భగవానుడిగా కొలవటంలో ఆంతర్యాన్ని అర్ధంచేసుకునే ప్రయత్నం చేయండి. ఉదయాన్నే పది నిమిషాలు సూర్యుడి కిరణాలు శరీరాన్ని తాకితే, 'D' విటమిన్ లోపం లేకుండా, రోగనిరోధకశక్తి పెరుగుతుందని, ఇప్పటి డాక్టర్లు చెబుతున్నారు. దీన్నే అప్పట్లో సూర్య నమస్కారాలు చేయటం నిత్య కృత్యంగా అవలంబిస్తే, మీకు తప్పుగా అనిపిస్తోందా? చంద్రుడిని మామగా సంబోధిస్తూ, జనానికి చేరువచేసి, వెన్నెలను ఆస్వాదిస్తూ, ఆహ్లాదంగా గడపటం సామాజిక చేతనగా మీకు కనపడదా?


పశు, పక్ష్యాదులను దైవ స్వరూపాలుగా చేసి, పూజిస్తూ, గౌరవిస్తూ, వాటి ఆలనా, పాలనా చూడటం, నేటి బయో డైవర్సిటీ గా మీకు అర్ధం కాలేదా? ఆవును గోమాతగా, కుక్కను భైరవుడిగా, పందిని వరాహమూర్తిగా, పామును నాగదేవతగా, ఇలా సర్వ ప్రాణికోటిలోనూ ఉన్నది పరమాత్మ స్వరూపమేనని, సకల శ్రేయోకర జీవన విధానాన్ని చాటి చెప్పే విలువైన భారతీయ సంస్కృతిని అర్ధంచేసుకునే ప్రయత్నం చేయండి. 

ఏ దేశానికైనా వనరులు, స్థిరాస్తులు ఎంత ముఖ్యమో, చరాస్తిలో విలువైన బంగారానికి అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అంటే దేశంలో ఉన్న బంగారం నిలువల ద్వారా ఆ దేశ ఆర్ధికస్థితి నిర్ణయించబడుతుంది. వ్యక్తిగతంగా కూడా, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే, బంగారమే పెద్ద దిక్కు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి కాలానుగుణంగా విలువ పెరుగుతూనే వస్తోంది. దీన్ని ఎప్పుడో గుర్తించిన భారతీయ జ్ఞాన సంపన్నులు దీర్ఘదృష్టితో, ఆధ్యాత్మికతను బంగారంతో ముడిపెట్టి, దేశాన్ని ధృడ ఆర్ధిక వ్యవస్థగా నిలబెట్టారు. సాంప్రదాయాల పేరుతో బంగారపు భాండాగారంగా తీర్చిదిద్దారు. 


సృజనాత్మక కళతో, ఆభరణాలు రూపొందించి, సంప్రదాయంగా ప్రజానీకానికి చేరువ చేశారు. ఏ దేశంలో లేని విధంగా ఆధ్యాత్మిక భావనను, సంప్రదాయంతో మేళవించి, విలువైన వజ్ర, వైడూర్యాలు, బంగారం, వెండి వంటి ఖనిజ సంపదను భారతదేశ ప్రజలందరూ కలిగి ఉండేలా, సుస్థిర ఆర్ధిక స్థిరత్వాన్ని జీవన శైలిలో భాగం చేశారు. ఆ మహానుభావుల ముందుచూపుతో కూడిన జ్ఞాన సంపదే, నేటి స్వర్ణ శోభిత భారతదేశం. ఒక్కసారి ఊహించుకోండి... మనదేశ దేవాలయాలు, మహిళల వద్ద ఉన్న ఈ అపార సంపదతో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా సరితూగగలదా? 


దేశ సంపదగా వెలకట్టలేని, లెక్కకురాని వీటివల్ల ప్రయోజనం ఏముందనే అనుమానం రావొచ్చు. ఆ పాత సాంప్రదాయాలు కొనసాగించటంవల్లే, ఇంకా బంగారం దిగుమతులు పెరిగి, ఇతర దేశాల మారకం విలువలు పెరుగుతున్నాయనే అసహనం పెరగవచ్చు. కానీ దేశంలో ప్రజలు కేంద్రబిందువుగా ప్రత్యామ్నాయ ఆర్ధిక స్థిరత్వం పెరగటాన్ని గమనించాలి. వీటి ద్వారా ప్రభుత్వాలకు పెరుగుతున్న పన్నుల రాబడి గుర్తించాలి. ముఖ్యంగా ఇవన్నీ అత్యవసర పరిస్థితుల్లో,ఆపత్కాలంలో, దేశానికైనా, వ్యక్తులకైనా, ఆర్ధికంగా అండగా నిలిచేవి. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా భారత్ తట్టుకుని నిలబడుతోంది. 


అభివృద్ధికి ఆధ్యాత్మికత అడ్డమా? - 5


నాస్తిక, హేతువాద, మానవవాదులకు అభివృద్ధి అంటే సరైన అర్ధం తెలుసా? పెద్ద పెద్ద భవనాలు, మౌలిక సౌకర్యాలు వంటివి మాత్రమే అభివృద్ధికి కొలమానంగా చూస్తున్నారా?

 సైన్స్, వైజ్ఞానిక పురోగతి, నూతన ఆవిష్కరణలు వరకే అభివృద్ధి పరిమితమా? ఇవన్నీ సాధించిన దేశాలు, ప్రకృతి విలయాలకు కకావికలమవటం చూస్తూనే ఉన్నాం కదా. మనుషులలో స్వార్ధం నశించి, ప్రకృతి నియమాలకు లోబడి జీవించటమే నిజమైన అభివృద్ధి. అందుకు అవసరమయ్యే సానుకూల మనస్థితిని పెంపొందించేదే ఆధ్యాత్మిక మార్గము. మనుషులు తమ కర్తవ్యం, సాటి మనుషులు, జీవకోటి, ప్రకృతి మొత్తాన్ని దైవంగా భావించి, 
ప్రేమాభిమానాలతో మెలిగేలా తీర్చిదిద్దెదే ఆధ్యాత్మికత. 


ఎవరి విశ్వాసాలు, నమ్మకాలూ వారికుంటాయి. మేము నమ్మము అనేవారితో సమస్యే లేదు. కానీ నమ్మేవారందరు మూర్ఖులని, అభివృద్ధి నిరోధకులని హేళన చేస్తూ, మీ వాదాలతో దాడికి దిగటం సంస్కారమా?

ప్రశ్నించటం, తెలుసుకోవటం, సరైన మార్గాన్ని ఎంచుకోవటం, ఇవన్నీ మీకన్నా ముందే, ఆధ్యాత్మిక ప్రపంచం, సత్యాన్వేషణ, శోధన రూపంలో ఎప్పటినుంచో ఆచరిస్తోంది. ఆ కారణంగానే ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి.

 ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలమైన ఎన్నో విషయాలు భారత ప్రాచీన విద్యా విధానం ద్వారా రూపొందినవే. సున్నా (జీరో) దశాంశ స్థానాలు వినియోగం నుంచి రాజనీతి శాస్త్రం వరకు ఎన్నింటినో మన పూర్వీకులు స్పష్టమైన వివరాలతో భావితరాలకి అందించారు. అద్భుత కట్టడాలను అలవోకగా నిర్మించిన ఇంజనీరింగ్ ప్రతిభ అప్పటికే మన సొంతం. అరవైనాలుగు కళలలో ఆరితేరిన నైపుణ్యం భారతీయులది.
 ఖగోళ విజ్ఞాన, సూర్య, చంద్ర, నక్షత్ర గమనలను లెక్కలు కట్టి పౌర్ణమి , అమావాస్య, గ్రణాలను చెప్పిన చరిత్ర మనది. అయితే బ్రిటీష్ వారి బానిసత్వంలో మనదేశంలోకి విదేశీ విద్యా విధానం చొరబడింది. మంచి ఎక్కడన్నా 
నేర్చుకోవటం తప్పుకాదు. కానీ మన ఉనికి మరచి వాళ్ళ విధానాలకు ఆకర్షితులయ్యాము. ఫలితంగా విద్య ద్వారా విజ్ఞానవంతులయ్యే పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. చదువుతో సంస్కారం,
 విజ్ఞానం, మానవతా విలువలు నేర్చుకునే పధ్ధతి ఎప్పుడో వదిలేసాము. చదువంటే పెద్ద 
జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన డిగ్రీలు సాధించే వ్యవస్థగా మార్చుకున్నాము. విదేశీ విధానాల అనుకరణలో, మన ప్రాచీన జీవన శైలి గొప్పదనాన్ని విస్మరించాము. 

ప్రపంచంలో ఎక్కడైనా మంచి చెడు రెండూ  ఉంటాయి. అవి ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా కొట్లాడుకుంటాయి. ఈ యుద్ధంలో గెలిచేది మంచా, చెడా అనేది మన పైనే ఆధారపడి ఉంటుంది. మనిషి తనలోనే ఉన్న మంచి, చెడులలో దేనిని పెంచి పోషిస్తే, అది బలీయంగా మారి రెండవదాన్ని అంతమొందిస్తుంది.
   చెడును పెంచుకుంటూ వెళితే, అది మనిషినే మింగేసి, సమాజానికి శాశ్వత  శత్రువుని చేస్తుంది. మంచిని పెంచుకుని, పంచితే అదే మనిషి ఉన్నతుడిగా మారి తరతరాలకు సమాజం కీర్తించే మహానీయుడవుతాడు. చెడు పై మంచి విజయం సాధించేందుకు మనుషులుగా మన ప్రయత్నం నిరంతరం కొనసాగిద్దాము.

మీరు నిజంగానే అభివృద్ధిని కోరుకుంటే, భారత రాజ్యాంగం నుంచి కులం,మతం, తొలగించి, అందరికి ఉచితంగా 
విద్య, వైద్యం తప్పనిసరిగా అందించాలని ఉద్యమించలేరా?
 ఈ ఒక్క ఆలోచన ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని అందించలేదా?  ప్రజలంతా తేలికగా అర్ధంచేసుకుని, చైతన్యంతో కలసి వచ్చేందుకు, పాలకులపై వత్తిడి తెచ్చేందుకు సరైన అస్త్రం ఇదికదా? ఆలోచించండి. 


వాదాలతో గందరగోళాలు, చర్చలతో కాలక్షేపాలు ఆపి, విద్య, వైద్యం అందరికీ చేరువ చేసే అభివృద్ధి వైపు ముందడుగు వేద్దాం. సాధించుకునేందుకు యువతరాన్ని జాగృతం చేద్దాం. 



కార్తికేయ మణికుమార్ 
సీనియర్ జర్నలిస్ట్