ప్రకృతి ఎరువులు - Natural Fertilizers
మానవ మనుగడకు వ్యవసాయం ఎంత ముఖ్యమో, ఆ సేద్యానికి భూసారం అంతే అవసరం. వ్యవసాయభూమిలో ఏడాదికి రెండు పంటలు వేయటం, ఆ పంటల అధిక దిగుబడికి రసాయనిక ఎరువుల వాడకం ప్రస్తుతం రైతులకు తప్పనిసరిగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పద్దతి కొనసాగడంతో భూసారం క్రమేపి తగ్గిపోతోంది. ఇదే సందర్భంలో రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగంతో భూమి విషతుల్యమవుతోంది. పూర్వకాలంలో ఎక్కువగా పశువులపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ఈ పశువుల మల, మూత్రాలు పంటపొలాలకు సహజ ఎరువుగా ఉపయోగపడి, భూసారాన్ని కాపాడేవి. అదేవిధంగా ఊళ్లలోని కాలువగట్లు బహిరంగ మల, మూత్రవిసర్జన కేంద్రాలుగా ఉండేవి. ఆ కాలువలనుంచి పారే నీరు పొలాలను ప్రాకృతిక లవణాలతో బలవర్థకం చేసేది. కాలువ పూడికతీత సమయాల్లో గట్లపై మట్టిని, పొలాలకు ఎరువుగా కూడా ఉపయోగించేవారు. ప్రస్తుతం నాగరి కత పెరిగి మరుగుదొడ్లు విస్తృతమయ్యాయి. ఇందులో భాగంగానే మురుగు నీటి పారుదలకు డ్రయినేజ్ వ్యవస్థ వచ్చింది. నగరాలూ, పట్టణాలలో విస్తృతమైన డ్రయినేజ్ వ్యవస్థలో మొత్తం మురుగునీటిని ఒకచోటికి చేర్చి, సీనరేజ్ వ్యవస్థ ద్వారా శుద్ధిచేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మానవ వ్యర్ధాలు మురుగునీటిలో కలువకుండా, ప్రత్యామ్నాయ పైప్ లైన్లద్వారా సహజ ఎరువులుగా మార్చి పంటపొలాలకు చేరవేయాలనేది మా ఆధునిక ఆవిష్కరణ సారంశాము. అంటే కొత్తగా నిర్మించే నగరాలూ, పట్టణాలు, టౌన్ షిప్ లలో రెండు పైప్ లైన్ల భూగర్భ డ్రయినేజ్ వ్యవస్థను నిర్మాణ దశలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతాల ఇళ్లలోని మరుగుదొడ్ల నిర్మాణంలోనే మానవవ్యర్ధాలను వేరుచేస్తూ కమోడ్లనుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుతో భూగర్భ డ్రయినేజ్ వ్యవస్థలోని పెద్ద పైప్ లైన్లలో ఒకదానికి కలపాలి. అదే ఇంట్లో బట్టలుతికిన, అంట్లు తోమిన, స్నానం చేసిన వంటి ఇతర వ్యర్థ జలాన్ని మరొక పైపులైన్ ద్వారా భూగర్భ డ్ రయినేజ్ వ్యవస్థలో కలపాలి. అంటే చెత్త సేకరణ విషయంలో ఏవిధంగా తడి చెత్త, పొడి చెత్త అని వేరుచేస్తున్నామో అదే విధంగా, సబ్బు, సర్ఫ్, షాంపూ వంటి రసాయనాలతో కూడిన మురుగు నీటిని, మానవ మల, మూత్రాలతో కలువకుండా వేరు చేయాలి. ఇలా వేరుచేసిన మానవ వ్యర్ధాలను ప్రత్యేక డ్రయినేజ్ వ్యవస్థ ద్వారా సమీపంలోని పంటపొలాలకు సహజ ఎరువులుగా అందించే ఏర్పాటు చేయాలి. ఈవిధమైన శాశ్వత ప్రక్రియ ద్వారా ఆధునిక యుగంలో కూడా, ప్రకృతి ఎరువుతో పంటల నాణ్యమైన అధిక దిగుబడి పొందగలము. సహజసిద్ధంగా భూసారా న్ని పెంపొందించుకోగలము.