Sunday, 19 August 2012

మార్పు మనతోనే ...

ప్రపంచంలో ఎక్కడైనా మంచి చెడు రెండూ  ఉంటాయి. అవి ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా కొట్లాడుకుంటాయి. ఈ యుద్ధంలో గెలిచేది మంచా, చెడా అనేది మనిషి పైనే ఆధారపడి ఉంటుంది. మనిషి తనలోనే ఉన్న మంచి, చెడులలో దేనిని పెంచి పోషిస్తే, అది బలీయంగా మారి రెండవదాన్ని అంతమొందిస్తుంది. చెడును పెంచుకుంటూ వెళితే, అది మనిషినే మింగేసి, సమాజానికి శాశ్వత శత్రువుని చేస్తుంది. మంచిని పెంచుకుని, పంచితే అదే మనిషి ఉన్నతుడిగా మారి తరతరాలకు సమాజం కీర్తించే మహానీయుడవుతాడు. చెడు పైన మంచి విజయం సాధించేందుకు మనుషులుగా మన ప్రయత్నం నిరంతరం కొనసాగిద్దాము.         సమాజంలో చెడు ఎక్కువైనప్పుడే అన్ని రకాల సమస్యలు వస్తాయి. అందరూ మంచివారే, కాని పరిస్థితుల ప్రభావంతోనో, అనాలోచిత స్వార్ధం వల్లనో చెడు వైపు వెళుతుంటారు. అయితే భారతదేశంలోని ఎక్కువశాతం ప్రజలు అందులో భాగమైన నాయకులు, అధికారులతో సహా ఎవరి స్థాయిలో వారు అవినీతిలో కూరుకు పోవటం కాదనలేని నిజం. వీరందరూ (మనమందరం) తప్పు చేస్తున్నామని తెలిసినా, లోకమంతా అలాగే ఉందికదా అని సమర్ధించుకుంటారు. మరికొందరు డబ్బు, అధికారం లేకపోతే మనిషికి ఏమాత్రం విలువ ఉండదని, వాటి కోసం ఎంతకైనా తెగించవచ్చని వాదిస్తారు. ఇంకొందరు ఈ కలియుగ ధర్మంలో మంచి పనికిరాదని, కొత్త వేదాంతం చెబుతారు. అందరూ అలానే ఉన్నప్పుడు,మనం మాత్రమే మంచికిపోతే చేతగాని వారిగా వెనకపడి పోతామనేవారూ ఉన్నారు. కొందరైతే వ్యవస్థలో మార్పు రాకుండా వ్యక్తులు మారటం కష్టం అంటున్నారు.  
  

ఇలా ఎవరి కారణాలు వారికున్నాయి. మనిషి సంఘ జీవి అని ఎప్పుడో చదువుకున్నాం. దాన్ని లోతుగా పరిశీలన చేస్తే, ప్రతి మనిషి తను ఒక్కడు, తర్వాత తన కుటుంబం, అలాంటి అనేక కుటుంబాలు కలిస్తే సమాజం, ఈ సమాజాల సమూహమే ప్రాంతం, రాష్ట్రం, దేశం, ప్రపంచం. అసలు ఈ సమాజం అనేదే లేకుండా మనం ఒక్కరమే సకల సంపదలు, అన్ని సౌకర్యాలు స్వంతం చేసుకున్నప్పటికీ ఆనందంగా ఉండగలమా? అంటే అలా ఊహించటానికి కూడా భయపడే చేదు నిజం.  

                                              


అయితే మొత్తంగా అందరూ వ్యవస్థలో మార్పు రావాలని మాత్రం కోరుకుంటున్నారు. ఉన్నత స్థాయిలోని విశ్వసనీయమైన వ్యక్తులెవరైనా ముందుకొచ్చి మంచి వైపు ప్రేరణ కలిగిస్తే మారేందుకు అందరూ సిద్ధమే.



ఈ నిస్తేజ స్థితి నుంచి చైతన్యవంతులయ్యే మార్పు కోసం నిస్వార్థ పరులు, మంచి ఆలోచనలు కలిగిన వారంతా ఏకం కావాలి. ప్రతి వ్యక్తి ముందు తనలో మంచి వైపు మార్పు ద్వారానే, సమాజం మొత్తంలో  మార్పు వస్తుందనే  సత్యాన్ని ఆచరణ ద్వారా చాటి చెప్పాలి.  అలాంటి మార్పుకు అనుకూలమైన సామాజిక వ్యవస్థను మనతరం నిర్మించుకోవటం ప్రస్తుత అవసరం. అప్పుడు మాత్రమే మన భవిష్యత్ తరాలు ఆ మంచి బాటలో నడిచి. ఉత్తమ పౌరులుగా భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతారు.