ప్రపంచ ఆర్దిక వ్యవస్థకు మూలమైన ఎన్నో విషయాలు భారత ప్రాచీన విద్యా విధానం ద్వారా రూపొందినవే. సున్నా (జీరో) కనుగొనటం నుంచి రాజనీతి శాస్త్రం వరకు ఎన్నింటినో మన పూర్వీకులు స్పష్టమైన వివరాలతో భావితరాలకి అందించారు. అద్భుత కట్టడాలను అలవోకగా నిర్మించిన ఇంజనీరింగ్ ప్రతిభ అప్పటికే మన సొంతం. అరవైనాలుగు కళలలో ఆరితేరిన నైపుణ్యం భారతీయులది. ఖగోళ విజ్ఞానం, సూర్య, చంద్ర, నక్షత్ర గమనాలను లెక్కలు కట్టి పౌర్ణమి , అమావాస్య, గ్రహణాలను చెప్పిన చరిత్ర మనది.
అయితే బ్రిటీష్ వారి బానిసత్వంలో మనదేశంలోకి విదేశీ విద్యావిధానం చొరబడింది. మంచి ఎక్కడున్నా నేర్చుకోవటం తప్పుకాదు. కానీ మన ఉనికి మరచి వాళ్ళ విధానాలకు ఆకర్షితులయ్యాము. ఫలితంగా విద్య ద్వారా విజ్ఞానవంతులయ్యే పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. చదువుతో సంస్కారం, విజ్ఞానం, మానవతా విలువలు నేర్చుకునే పధ్ధతి ఎప్పుడో వదిలేసాము. చదువంటే పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన డిగ్రీలు సాధించే వ్యవస్థగా మార్చుకున్నాము.